State News
కలుషితమవుతున్న గండిపేట జలాశయం.. ప్లాస్టిక్ వ్యర్థాలతో తీవ్ర ముప్పు

హైదరాబాద్ గండిపేట, అక్టోబర్ 13 (పబ్లిక్ వైబ్): హైదరాబాద్ నగరానికి ప్రధాన తాగునీటి వనరుగా ఉన్న ఉస్మాన్ సాగర్ (గండిపేట) జలాశయం ప్రస్తుతం ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతోంది. పర్యాటకులు విసిరేస్తున్న ప్యాకేజింగ్ చెత్త, ప్లాస్టిక్ సీసాలు, కవర్లు నేరుగా నీటిలోకి చేరుతుండటంతో జలాశయం తీవ్రంగా కలుషితమవుతోంది. దీనికి తోడు సమీప క్యాచ్మెంట్ ఏరియాల నుంచి అక్రమంగా వ్యర్థాలు వచ్చి చేరడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తోంది.
నీటిలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు కాలక్రమేణా 'మైక్రోప్లాస్టిక్స్' (సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు) గా మారి నీటి నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. దీనివల్ల జలచరాల మనుగడ ప్రమాదంలో పడటంతో పాటు, ఆ నీటిని వినియోగించే ప్రజల ఆరోగ్యానికి కూడా తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చారిత్రక ప్రాధాన్యం ఉన్న గండిపేట చెరువు ఉనికి ప్రమాదంలో పడకముందే మున్సిపల్ అధికారులు, జలమండలి యంత్రాంగం తక్షణమే స్పందించాలని స్థానిక గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. జలాశయంలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి శుభ్రం చేయడంతో పాటు, చెరువులోకి వ్యర్థాలు చేరకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.