State News
ప్రజావాణి ఫిర్యాదులకు స్పందన కరువు..

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 12 (పబ్లిక్ వైబ్): ఆత్మకూర్ ఎం
మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి ప్రజావాణి వరకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త జెట్ట శ్రీనివాస్ వినూత్న నిరసనకు దిగారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహించడంతో, చివరకు పనిచేయని పోస్టాఫీస్ బాక్సులో ఫిర్యాదు వేసి తన నిరసనను వ్యంగ్యంగా తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రజావాణి వేదికలను ఏర్పాటు చేసినప్పటికీ, అక్కడ ఇచ్చిన దరఖాస్తులకే గతి లేకపోతే సామాన్యులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. కార్యాలయాల చుట్టూ తిరగడం, దరఖాస్తులు ఇవ్వడం తప్ప సమస్యలకు పరిష్కారం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజావాణి అంటే కేవలం దరఖాస్తులు స్వీకరించి రసీదులు ఇవ్వడమే కాకుండా, నిర్ణీత గడువులోగా వాటిపై తీసుకున్న చర్యలను కూడా బాధితులకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ పరిష్కారం సాధ్యం కాకపోతే అందుకు గల కారణాలను లిఖితపూర్వకంగా వివరించడం అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను వినడం ప్రభుత్వ యంత్రాంగం ప్రాథమిక కర్తవ్యమని, పౌరుల సహనాన్ని పరీక్షించకుండా అధికారులు వెంటనే స్పందించాలని కోరారు. “ప్రజావాణి బాక్సులో పడే ఫిర్యాదు కాగితం కాదు.. అది ఒక కుటుంబం ఎదురుచూపు, బాధితుడి ఆవేదన, పౌరుడి హక్కు” అని ఈ సందర్భంగా జెట్ట శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.