State News
బట్టలు ఉతకడానికి వెళ్లి నీటిపాలైన ముగ్గురు.. సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం

సంగారెడ్డి జిల్లా, అక్టోబర్ 09 (పబ్లిక్ వైబ్): జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మనూరు గ్రామ శివారులో బట్టలు ఉతకడానికి వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతులను నరసింహారెడ్డి (45), సంగమేశ్వర్ రెడ్డి (42), కృష్ణవేణి (38)గా గుర్తించారు. బట్టలు ఉతకడానికి వెళ్లిన క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా.. నరసింహారెడ్డి, సంగమేశ్వర్ రెడ్డి మృతదేహాలు లభ్యమయ్యాయి. నీటి నుంచి బయటకు తీసిన కృష్ణవేణిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఒకేసారి దుర్మరణం చెందడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.