State News
ఖానాపూర్ సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తాం: డిప్యూటీ కమిషనర్

రంగారెడ్డి జిల్లా, అక్టోబర్ 08 (పబ్లిక్ వైబ్): ఖానాపూర్ గ్రామంలో ఎదురవుతున్న పలు సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం ఆయన ఖానాపూర్ గ్రామంలో పర్యటించి స్థానిక పరిస్థితులను, సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గత కొద్ది రోజులుగా గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో పర్యటించి, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, తాగునీరు తదితర అంశాలపై అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పర్యటన సందర్భంగా స్థానిక నేతలు, ప్రజలు పలు సమస్యలపై డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా బుల్కాపూర్ నాలా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, సూరివానికుంటను అభివృద్ధి చేసి దాని చుట్టూ రోడ్డు, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్‌తో పాటు డ్రైనేజీ పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే గ్రామంలో పెరుగుతున్న దోమల నివారణకు పారిశుధ్య చర్యలు చేపట్టాలని, తాగునీటి సమస్యను పరిష్కరించి కమిటీ హాల్‌కు మంజీరా నీటి కనెక్షన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దెబ్బతిన్న సీసీ రోడ్లకు ప్యాచ్ వర్క్‌లు చేపట్టి, అవసరమైన ప్రాంతాల్లో నూతన రోడ్లు వేయాలని, స్వామి వివేకానంద యూత్ రూమ్‌కు కాంపౌండ్ వాల్ నిర్మించాలని తెలిపారు. వీధుల్లో పనిచేయని లైట్లను బాగుచేసి, అవసరమైన చోట కొత్త విద్యుత్ స్తంభాలు, త్రీ-ఫేజ్ కనెక్షన్లు మంజూరు చేయాలని డిసీ దృష్టికి తీసుకెళ్లారు.
ప్రజల వినతులపై డిప్యూటీ కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ప్రధానమైన బుల్కాపూర్ నాలా సమస్యకు ఇప్పటికే బడ్జెట్ కేటాయించడం జరిగిందని స్పష్టం చేశారు. మిగిలిన సమస్యలను కూడా సానుకూలంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏ.ఈ సంతోష్, బిల్ కలెక్టర్ రవీందర్ రెడ్డి, వార్డ్ ఆఫీసర్ ప్రభాకర్ మాజీ సర్పంచ్ మన్నె గండయ్య, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్, కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు రామేశ్వరం నరసింహ, ఓబీసీ మోర్చా జిల్లా మాజీ అధ్యక్షులు దుద్దాల లక్ష్మీనారాయణ, మాజీ కౌన్సిలర్ గున్నల అమరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పెద్దపులి కృష్ణ (కిషన్), పిఎసిఎస్ చైర్మన్ తోలుకోటె కృష్ణ, గండిపేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన్నె నరేందర్ ముదిరాజ్, పసుల ఉపేందర్ ముదిరాజ్, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.