State News
అనంతగిరి ఘాట్ రోడ్డులో బోల్తా పడిన ప్రైవేటు బస్సు

వికారాబాద్ జిల్లా, అక్టోబర్ (పబ్లిక్ వైబ్): వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో నలుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సమీపంలోని కేసారం గ్రామానికి చెందిన సుమారు 54 మంది ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం చింతకుంటకు బయలుదేరారు. గ్రామానికి చెందిన ఒకరి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బంధువులంతా ఈ బస్సులో ప్రయాణమయ్యారు.
ఈ క్రమంలో బస్సు వికారాబాద్లోని ప్రసిద్ధ అనంతగిరి కొండల మీదుగా కిందికి దిగుతున్న సమయంలో ఘాట్ రోడ్డు వద్ద అకస్మాత్తుగా అదుపుతప్పింది. రోడ్డు పక్కకు దూసుకెళ్లిన బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. బస్సు వేగంగా బోల్తా పడటంతో ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేస్తూ భయభ్రాంతులకు గురయ్యారు.
నలుగురు మహిళలు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం
ఈ ప్రమాదంలో నలుగురు మహిళా ప్రయాణికులు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

బస్సులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను బయటకు తీసి, వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఘాట్ రోడ్డు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, వారికి అవసరమైన అన్ని రకాల సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఘటనా స్థలాన్ని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు తక్షణ సాయం అందించాలని, సహాయక చర్యలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.