← Back to PublicVibe Media

State News

గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

చారిత్రాత్మక గోల్కొండ కోటలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ విద్య, వైద్య రంగాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఉస్మానియా నూతన ఆస్పత్రి భవన నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, మరో 8 కొత్త మెడికల్ కాలేజీలకు భవనాలు నిర్మిస్తున్నామని వెల్లడించారు. విద్యా సూచీలో గతంలో 21వ స్థానంలో ఉన్న తెలంగాణ, తమ పాలనలో 14వ స్థానానికి మెరుగుపడిందని తెలిపారు. నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా వందకు పైగా 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్' నిర్మించే లక్ష్యంతో ఉన్నామన్నారు.

సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

ఉపాధి, ఉద్యోగాలు: ఉద్యోగ నియామకాల్లో అక్రమాలకు తావులేకుండా టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామని సీఎం తెలిపారు. టీఎస్-ఐపాస్ ద్వారా రాష్ట్రానికి రూ.1.95 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దీని ద్వారా మరో 78 వేలకు పైగా ఉద్యోగావకాశాలు రాబోతున్నాయని చెప్పారు.

హైదరాబాద్‌ గ్లోబల్ హబ్: నగరంలో ప్రస్తుతం 355కు పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs) పనిచేస్తున్నాయని, ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ రాష్ట్రంలో 7 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెడుతోందని వెల్లడించారు.

మహిళా సాధికారత: కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగా మహిళలను ఆర్టీసీ అద్దె బస్సులకు యజమానులుగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు.

సంక్షేమం: రాష్ట్రంలో ఇప్పటికే 15 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని, రెండో విడత కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఇవాళ్టి నుంచే ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. అలాగే వృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని గుర్తుచేశారు.

క్రీడారంగం: మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు 'సీఎం కప్' పోటీలు నిర్వహించామని, త్వరలో జరగబోయే 'ఖేల్ ఇండియా' పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతోందని సీఎం సంతోషం వ్యక్తం చేశారు.