న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ శుభ సమయాన భారత వాయుసేన హెలికాప్టర్లు ఎర్రకోట పరిసరాల్లో పూలవర్షం కురిపించాయి. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఈ వేడుకల్లో 'వందేమాతరం' గేయాన్ని పూర్తిస్థాయిలో ఆలపించడం విశేషం. ప్రధానిగా మోదీ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేయడం ఇది 13వసారి.
జెండా ఆవిష్కరణకు ముందు ప్రధాని మోదీ రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీ సమాధిని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోట వద్ద త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించారు.
జెండా ఆవిష్కరణ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. "నేడు దేశమంతటా హర్‌ఘర్ తిరంగాతో ప్రతి ఇల్లూ మువ్వన్నెలతో శోభిస్తోంది. గతంలో ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉన్న భారత్, గత 12 ఏళ్ల కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది" అని ప్రధాని పేర్కొన్నారు.
భారత్ ఇకపై చిన్న లక్ష్యాలతో ఆగిపోకూడదని, ఉన్నతమైన ఆలోచనలతో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. భారత్ ‘వికసిత భారత్’గా మారినప్పుడు ప్రపంచం మనల్ని చూసే కోణమే మారుతుందని, ప్రతీ రంగంలోనూ స్వయంసమృద్ధి సాధించడమే మన తక్షణ లక్ష్యమని స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
ఆర్థిక పురోగతి, పేదరిక నిర్మూలన: తమ ప్రభుత్వ హయాంలో 25 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని, 140 కోట్ల భారతీయుల దృఢ సంకల్పాన్ని ఎవరూ ఆపలేరని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.
టెక్నాలజీ, సెమీకండక్టర్లు: గ్లోబల్ టెక్ ప్రపంచంలో సెమీకండక్టర్ల ప్రాముఖ్యతను గుర్తించిన భారత్, ఇప్పటికే మూడు సెమీకండక్టర్ ప్లాంట్లను ప్రారంభించిందని, త్వరలోనే మరిన్ని ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.
హరిత ఇంధనం, రైల్వేలు: గత 90 ఏళ్లలో 30 శాతం మాత్రమే రైల్వే ఎలక్ట్రిఫికేషన్ జరగ్గా, గడిచిన 10 ఏళ్లలోనే 70 శాతం పూర్తి చేశామని మోదీ తెలిపారు. ఇటీవల విజయవంతంగా నడిపిన హైడ్రోజన్ రైలును ప్రస్తావించారు.
గ్యాస్, సౌరశక్తి సరఫరా: దేశవ్యాప్తంగా 70 నగరాల్లో పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా అందిస్తున్నామని, 1.75 కోట్ల ఇళ్లకు పైప్డ్ వంటగ్యాస్ అందుతోందన్నారు. అలాగే 50 లక్షల ఇళ్లకు సౌరశక్తి ద్వారా విద్యుత్ అందిస్తున్నట్లు వివరించారు.
అణు విద్యుత్ లక్ష్యాలు: ఇంధన భద్రత దేశానికి అత్యంత కీలకమని, 100 గిగావాట్ల అణు ఇంధన ఉత్పత్తి సాధించడమే లక్ష్యంగా 5 కొత్త న్యూక్లియర్ రియాక్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇటీవల దేశంలోని వివిధ ప్రాంతాల్లో సంభవించిన ప్రకృతి విపత్తుల పట్ల ప్రధాని విచారం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు దేశమంతా అండగా ఉంటుందని సంఘీభావం తెలిపారు.
